Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

గలతీయులకు 5వ అధ్యాయము

1  ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి. 
2  చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. 
3  ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడైయున్నాడని సున్నతిపొందిన ప్రతి మనుష్యునికి నేను మరల మీతో దృఢముగ చెప్పుచున్నాను. 
4  మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి తొలగిపోయి వేరుచేయబడియున్నారు, కృపలోనుండి తొలగిపోయి యున్నారు. 
5  ఏలయనగా మనము విశ్వాసముగల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము. 
6  యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపొవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. 
7  మీరు బాగుగ పరుగెత్తుచుంటిరి; సత్యమునుకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను? 
8  ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్నవానివలన కలుగలేదు. 
9  పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును గదా? 
10  మీరెంతమాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. 
11  సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా? 
12  మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. 
13  సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. 
14  ధర్మశాస్త్రమంతయు -నీవలె నీ పొరుగువాని ప్రేమించుము1అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది. 
15  అయితే మీరు ఒకనికొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తుగా నశించిపోదురేమో చూచుకొనుడి. 
16  నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 
17  శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు. 
18  మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. 
19  శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 
20  విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 
21  భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పినప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. 
22  అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 
23  ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. 
24  క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసియున్నారు. 
25  మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. 
26  ఒకనికొకరము వివాదమునకు రేపకును, ఒకరియందొకరము అసూయపడకను వృథాగా అతిశయపడకను ఉందము.
       Download Audio File

No comments:

Post a Comment