Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

గలతీయులకు 1వ అధ్యాయము

1  మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక యేసుక్రీస్తు1వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలును, 
2  నాతో కూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు (శుభమని చెప్పి ) వ్రాయునది. 
3  తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసు క్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. 
4  మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము ఆయన మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి2విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. 
5  ఆ దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. 
6  క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. 
7  అది మరియొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. 
8  మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. 
9  మేమిదివరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరంచిన సువార్తగాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినపక్షమందు వాడు శాపగ్రస్తుడవునుగాక. 
10  ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును. 
11  సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. 
12  మనుష్యునివలన దాని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే (అది నాకు సంప్రాప్తమైనది ). 
13  పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి పాడుచేయుచు. 
14  నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి. 
15  అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని 
16  ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యులమాత్రులతో3నేను సంప్రతింపలేదు. 
17  నా కంటే ముందుగా అపొస్తలులైనవారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరబీదేశములోకి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. 
18  అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేముకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని. 
19  అతని తప్ప అపొస్తలులో మరి ఎవనిని నేను చూడలేదు గాని ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. 
20  నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుటలేదు. 
21  తరువాత సురియ, కిలికియ ప్రాంతములలోకి వచ్చితిని. 
22  క్రీస్తునందున్న యూదైయసంఘములవారికి నా ముఖపరిచయము లేకుండెను గాని 
23-24. - మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును4ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్నుబట్టి దేవుని మహిమపరచిరి.

No comments:

Post a Comment