Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

గలతీయులకు 1వ అధ్యాయము

1  మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక యేసుక్రీస్తు1వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలును, 
2  నాతో కూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు (శుభమని చెప్పి ) వ్రాయునది. 
3  తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసు క్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. 
4  మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము ఆయన మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి2విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. 
5  ఆ దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. 
6  క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. 
7  అది మరియొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. 
8  మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. 
9  మేమిదివరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరంచిన సువార్తగాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినపక్షమందు వాడు శాపగ్రస్తుడవునుగాక. 
10  ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును. 
11  సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. 
12  మనుష్యునివలన దాని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే (అది నాకు సంప్రాప్తమైనది ). 
13  పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి పాడుచేయుచు. 
14  నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి. 
15  అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని 
16  ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యులమాత్రులతో3నేను సంప్రతింపలేదు. 
17  నా కంటే ముందుగా అపొస్తలులైనవారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరబీదేశములోకి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. 
18  అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేముకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని. 
19  అతని తప్ప అపొస్తలులో మరి ఎవనిని నేను చూడలేదు గాని ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. 
20  నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుటలేదు. 
21  తరువాత సురియ, కిలికియ ప్రాంతములలోకి వచ్చితిని. 
22  క్రీస్తునందున్న యూదైయసంఘములవారికి నా ముఖపరిచయము లేకుండెను గాని 
23-24. - మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును4ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్నుబట్టి దేవుని మహిమపరచిరి.

గలతీయులకు 2వ అధ్యాయము

1  అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూషలేముకు తిరిగి వెళ్లితిని. 
2  దేవదర్శన ప్రకారమే వెళ్లితిని. మరియు నా పరుగు5 వ్యర్థమవునేమో, లేక వ్యర్థమైపోయినదేమో, అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని, ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని. 
3  అయినను నాతోకూడనున్న తీతు హెల్లేనీయుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్టబడలేదు. 
4  మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తుయేసువలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన (ఆ ప్రయత్నమైనను ) జరిగినది. 
5  సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. 
6  ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యములేదు, దేవుడు నరునివేషము చూడడు. 1ఆ యెన్నికైనవారు నా కేమియు ఉపదేశింపలేదు. 
7  అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నాకప్పగింపబడెనని వారు చూచినప్పుడు, 
  8-9. అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలుడవుటకు పేతురుకు సామర్థ్యము కలుగజేసినవాడే అన్యజనులకు అపొస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యూకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమగుటకు (సూచనగా ) నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి. 
10  మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెననిమాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని. 
  11-12. తరువాత కేఫా అంతియొకైయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని; ఏలయనగా యూకోబునొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందినవారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను. 
13  తక్కిన యూదులను అతనితో కలసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోసపోయెను. 
14  వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా - నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు? 
  15-16. మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసమువలననే గాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసమువలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము, ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. 
17  కాగ మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడ వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు. 
18  నేను పడగొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా. 
19  నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్ర విషయమై చచ్చినవాడనైతిని. 
20  నేను క్రీస్తుతోకూడ సిలువవేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను శరీరమందు జీవించుచున్న జీవనము, నన్ను ప్రేమించి నాకొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. 
21  నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ ప్రయోజనమే గదా.
          Download Audio File

గలతీయులకు 3వ అధ్యాయము

1  ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులయెదుట వర్ణింపబడెనుగదా. 
2  ఇది మాత్రమే మీవలన తెలిసికొన గోరుచున్నాను; ధర్మశాస్త్రసంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా? 
3  మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? 
4  వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? 
5  ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధమైన క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా (చేయించుచున్నాడు? ) 
6  అబ్రహాము దేవుని నమ్మినందున అది అతనికి నీతియని యెంచబడెను
7  కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలిసికొనుడి. 
8  దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులగా తీర్చునని లేఖనము దూరము చూచి -నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు3అని అబ్రాహాముకు సువార్త ముందుగా ప్రకటించెను. 
9  కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు. 
10  ధర్మశాస్త్రోక్తక్రియా సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా -ధర్మశాస్త్రగ్రంధమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగాఉండని ప్రతివాడును శాపగ్రస్తుడుఅని వ్రాయబడియున్నది. 
11  ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా -నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. 
12  ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని (విధులను ) ఆచరించువాడు వాటివలననే జీవించును. 
13-14. ఆత్మనుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తుమనకుగాను శాపగ్రాహియై3మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను; ఇందునుగూర్చి -మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. 
15  సహోదరులారా, మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడు చేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు. 
16  అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులనుగూర్చి అన్నట్టు - సంతానములకును అని చెప్పక ఒకనిగూర్చి అన్నట్టే - నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు. 
17  నేను చెప్పునదేమనగా - నన్నూట ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. 
18  ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగిన పక్షమందు ఇకను వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానమువలననే దానిని అనుగ్రహించెను. 
19  ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చుపర్యంతము అది అతిక్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను. 
20  మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. 
21  ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడియున్నయెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని. 
22  యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరిని పాపమునకు లోనైనవారినిగా ఎంచెను. 
23  విశ్వాస (మార్గ )ము వెల్లడికాకమునపు5ఇకముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమార్గమవలంబింపవలసిన వారముగా6చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైనవారమైతిమి. 
24  కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు విషయమై ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. 
25  అయితే విశ్వాసమార్గము వెల్లడియాయెను గనుక ఇకను బాలశిక్షకుని క్రింద ఉండము. 
26  యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కూమారులై యున్నారు. 
27  క్రీస్తులోకి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొన్నారు. 
28  ఇందులో యూదుడని హెల్లేనీయుడని లేదు, దాసుడని స్వతంత్రుడని హెల్లేనీయుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. 
29  మీరు క్రీస్తుసంబందులైతే7ఆ పక్షమందు అబ్రహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు. 
          Download Audio File

గలతీయులకు 4వ అధ్యాయము

1  మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. 
2  తండ్రిచేత నిర్ణయింపబడిన దినము వచ్చుపర్యంతము అతడు సంరక్షకులయొక్కయు గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును. 
3  అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోకసంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమైయుంటిమి; 
4  అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; 
5  అయన స్త్రీయందు పుట్టి మనము స్వీకృతపుత్రులము8 కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిన విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. 
6  మరియు మీరు కుమారులైయున్నందున - నాయనా తండ్రీ, అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోకి పంపెను. 
7  కాబట్టి నీవికను దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవై యున్నావు. 
8  ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని 
9  యిప్పుడు మీరు దేవుని ఎరిగినవారిను, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ ప్రయోజనమైనవియునైన మూలపాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండగోరనేల? 
10  మీరు దినములను మాసములను ఉత్సవకాలములను ఆచరించుచున్నారు. 
11  మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను. 
12  సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. 
13  మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినవాడనై నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. 
14  అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండినదానిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదుగాని దేవుని దూతనువలెను క్రీస్తుయేసునువలెను నన్ను అంగీకరించితిరి. 
15  మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసియుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. 
16  నేను మీతో నిజమాడినందున మీకు శత్రవునైతినా? 
17  వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో ఆశ్రయించుచున్నవారు కారు; మీరే తమ్మునాశ్రయింపవలెనని మిమ్మును ప్రత్యేకపరచ1గోరుచున్నారు. 
18  నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే. 
19  నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు పర్యంతము మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది. 
20  మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను. 
21  ధర్మశాస్త్రమునకు లోబడియుండ గోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. 
22  దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహాముకు కలిగిరని వ్రాయబడియున్నది గదా? 
23  అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను. 
24  ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండసంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు. 
25  ఈ హాగరు అనునది అరబిదేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతోకూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయి యున్నది. 
26  అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి. 
27  ఇందుకు -కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదన పడనిదానా, బిగ్గెరగా కేకలు వేయుము; ఏలయనగాపెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు బహు విస్తారముగా ఉన్నారుఅని వ్రాయబడియున్నది2. 
28  సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి (పుట్టిన ) కుమారులమై యున్నాము. 
29  అప్పుడు శరీరమునుబట్టి (పుట్టిన ) వాడు ఆత్మనుబట్టి (పుట్టిన ) వానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది. 
30  ఇందునుగూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?3దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసికుమారుడు స్వతంత్రురాలి కుమారునితోపాటు వారసుడై యుండడు. 
31  కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. 
       Download Audio File

గలతీయులకు 5వ అధ్యాయము

1  ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి. 
2  చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. 
3  ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడైయున్నాడని సున్నతిపొందిన ప్రతి మనుష్యునికి నేను మరల మీతో దృఢముగ చెప్పుచున్నాను. 
4  మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి తొలగిపోయి వేరుచేయబడియున్నారు, కృపలోనుండి తొలగిపోయి యున్నారు. 
5  ఏలయనగా మనము విశ్వాసముగల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము. 
6  యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపొవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. 
7  మీరు బాగుగ పరుగెత్తుచుంటిరి; సత్యమునుకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను? 
8  ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్నవానివలన కలుగలేదు. 
9  పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును గదా? 
10  మీరెంతమాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. 
11  సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా? 
12  మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. 
13  సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. 
14  ధర్మశాస్త్రమంతయు -నీవలె నీ పొరుగువాని ప్రేమించుము1అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది. 
15  అయితే మీరు ఒకనికొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తుగా నశించిపోదురేమో చూచుకొనుడి. 
16  నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 
17  శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు. 
18  మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. 
19  శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 
20  విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 
21  భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పినప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. 
22  అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 
23  ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. 
24  క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసియున్నారు. 
25  మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. 
26  ఒకనికొకరము వివాదమునకు రేపకును, ఒకరియందొకరము అసూయపడకను వృథాగా అతిశయపడకను ఉందము.
       Download Audio File

గలతీయులకు 6వ అధ్యాయము

1  సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను. 
2  ఒకని భారములనొకడు భరించి యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. 
3  ఎవడైనను వట్టివాడై యుండి తాను ఎన్నికైనవాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచుకొనును. 
4  ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును 
5  ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా? 
6  వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థమున్నిటిలో భాగమియ్యవలెను2. 
7  మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. 
8  ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమనుపంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును. 
9  మనము మేలుచేయుటయందు విసుకక యుందుము. మనము అలియక మేలుచేసితిమేని తగినకాలమందు పంట కోతుము. 
10  కాబట్టి మనకు సమయము దొరికినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడల మేలుచేయుదము. 
11  నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. 
12  శరీరవిషయమందు చక్కగా అగుపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువవిషయమై హింసపొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతముచేయుచున్నారు. 
13  అయితే వారు సున్నతిపొందినవారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు; తాము మీ శరీరవిషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. 
14  అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక; దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి యున్నాము. 
15  క్రొత్తసృష్టి (పొందుటయే ) గాని సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు. 
16  ఈ పద్ధతిచొప్పున నడుచుకొనువారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును గాక. 
17  నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమపెట్టవద్దు. 
18  సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్